Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి రాజన్న బిడ్డ .. వారెంతో షర్మిల కూడా అంతే, నెత్తిన పెట్టుకోలేం : చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్. దివంగత ముఖ్యమంత్రుల కుమార్తెలు ఎలాగో షర్మిల కూడా అంతేనని మోహన్ అన్నారు. 

ex congress mp chinta mohan sensational comments ysrtp president ys sharmila ksp
Author
First Published Jul 1, 2023, 2:39 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేతలెవరూ షర్మిల కోసం ఇడుపులపాయకు రావడం లేదన్నారు. ఈ ప్రచారమంతా ఒట్టిదేనని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ తప్పు చేసిందని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి అదే పొరపాటు చేయదలచుకోవడం లేదని.. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిలకు కూడా కూతుళ్లు వున్నారని వారంతా వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారెంతో షర్మిల కూడా అంతేనని.. ఆమెను నెత్తిన పెట్టుకొని నాయకత్వాన్ని అప్పగించడం కుదరని పని అన్నారు. 

కాగా.. తమ పార్టీలో వైఎస్ షర్మిలకు చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకునే ప్రతిపాదనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే మొదటికే మోసం రావచ్చునని ఆయన అభిమతంగా తెలుస్తోంది.

ALso Read: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం కానుందా?.. మాణిక్ రావ్ ఠాక్రే ఏమన్నారంటే..

అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే అన్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడా వ్యక్తం చేశారు. షర్మిల ఇమేజ్ కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో చేరితే మరో అధికార కేంద్ర ఏర్పడుతుందని భావించేవారు కూడా పార్టీలో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. షర్మిల ప్రవేశిస్తే మరో తలనొప్పి కూడా తయారవుతుందని భావిస్తున్నారు. పైగా, ఆమె తక్కువేమీ ఆశించడం లేదని అంటున్నారు. షర్మిల విషయాన్ని ఖమ్మంలో జరిగే బహిరంగ సభ తర్వాత పార్టీ అధిష్టానం తేల్చే అవకాశాలున్నాయి. జులై 2వ తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios