ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది తానేనని... ఆ ఘనత తనకు మాత్రమే దక్కిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన విశాఖలోని టీడీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసినప్పుడల్లా తనకు సంతోషం కలుగుతుందని.. హైదరాబాద్ నగరం, విశాఖ ఎయిర్ పోర్టు, విశాఖ నగరంలో చేసిన అభివృద్ధి చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో టీడీపీని గుర్తుపెట్టుకునేలా పునాదులు వేయాలనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఓడిపోయామని భయం ఉండకూడదని... ప్రజల పక్షాన పోరాటం చేయాలని నేతలకు సూచించారు.

అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టాలని చూస్తే ఇంకా రెచ్చిపోతారు తప్పితే అనిగిపోరని చంద్రబాబు అన్నారు. తాను 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని... ప్రతి ఒక్కరి జాతకాలు తనకు తెలుసునని అన్నారు. మంచిగా ఉంటే బాగుంటుందని, తమాషాలు చేయాలని చూస్తే సాధ్యం కాదని గట్టిగా హెచ్చరించారు. 

పోలీసుల్లో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. గతంలో తానెప్పుడు ఇంతగా పోరాడలేదని, నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నానన్నారు. వైసీపీ శ్రేణులు నాలుగు నెలల్లో 12 మందిని చంపేశారని, 570 దాడులు చేశారని, 120 కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.