ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటన  చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇటీవల కుప్పంలో వైసీపీ విజయం సాధించింది.

ఈ క్రమంలో చంద్రబాబు కుప్పం పర్యటన చేపట్టారు. కుప్పం జగన్ జాగీరు కాదని అన్నారు. కుప్పంలోనే మకాం వేసి..వైసీపీకి డిపాజిట్ రాకుండా చేస్తానని స్పష్టం చేశారు. పుంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఇసుక అమ్ముతూ పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. 

జెట్ స్పీడుతో వైసీపీపై పోరాటం చేద్దామని బాబు పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. పోలవరం, విశాఖ, అమరావతి అన్ని పోయాయని.. పోవడం తప్ప తెచ్చేవి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా లేకుండా చేస్తానని అన్నారు. గేరు మార్చి తన తడాక చూపిస్తానని హెచ్చరించారు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర చందన, ఇసుక స్మగ్లింగ్ ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు.

డబ్బులు తెచ్చి కుప్పంలో ఓటర్లకు పంచి వ్యస్థను నాశనం చేశారన్నారు. తెగించి ముందుకు పోవాలని కార్యకర్తలకు తెలిపారు. రౌడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రెండో కుప్పం నియోజకవర్గం కడపల్లి పంచాయతీ పోడూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబు పీఈఎస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త క్రిష్ణప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతి చెందిన క్రిష్ణప్ప కుటుంబానికి పార్టీ తరపున రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.