కాకినాడ: ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ 100రోజుల పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. 100 రోజుల్లోనే  ప్రజలు క్షమించలేనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శించారు. 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని వీడుతున్న నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారని పనులు అయ్యాక మళ్లీ వెళ్లిపోతుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి గురించి ఆలోచించకుండా సమర్థనాయకుల్ని తీర్చిదిద్దే విధంగా పార్టీ పనిచేస్తుందని కార్యకర్తలకు తెలిపారు. 

ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఇప్పటికీ టీడీపీ పటిష్టంగానే ఉందన్నారు. అయితే పార్టీ వదిలివెళ్తున్న వారు తనపై అపవాదులు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారతారంటూ తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. స్వలాభాల కోసం పార్టీ వీడుతూ తమపై నిందలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడమే తాను చేసిన తప్పు అంటూ  చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

జమిలీ అయితే మూడేళ్లలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, లేదంటే ఐదేళ్లలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికలలోపు పార్టీని సమర్థవంతంగా తయారు చేసేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన వర్గాలను మళ్లీ దగ్గర చేసేందుకు స్థానిక నాయకులంతా కలిసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

100 రోజుల పాలనలో హత్యలు, దాడులు, వేధింపులు తప్ప ఇంకేమీ లేవు:చంద్రబాబు

రాజన్న రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం: జగన్ 100రోజుల పాలనపై నారా లోకేష్