కాకినాడ: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ నేతృత్వంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పాలనలో రౌడీయిజం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. 

అసెంబ్లీలో కూడా జగన్ పార్టీ తీరు చాలా దారుణంగా ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు మైక్ కోసం పోరాడటం లేదని తాను మైక్ కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. 

ఇప్పటి వరకు 8మందిని పొట్టనబెట్టుకున్నారని అనేకమంది అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామంలో తాము నివసించేందుకు ఆత్మకూరు ప్రజలు పోరాటం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. 

చలో ఆత్మకూరు పేరుతో ఆ గ్రామ ప్రజలు నిరసనలకు దిగడం బాధాకరమన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పోలీస్ శాఖపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. రూరల్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది పోలీస్ వ్యవస్థకు గానీ ప్రజా వ్యవస్థకు గానీ మంచిది కాదన్నారు చంద్రబాబు. పోలీసులు ప్రజల తరపున పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

రాజన్న రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం: జగన్ 100రోజుల పాలనపై నారా లోకేష్

క్షమించలేనన్ని తప్పులు చేశారు : జగన్ 100రోజుల పాలనపై చంద్రబాబు కామెంట్స్