విజయవాడ: కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రబడ్జెట్ నిరాశజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను ఆడియాశలు చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీలను విస్మరించారని, అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో మొబైల్‌, వ్యవసాయం, సేవారంగాలకు ప్రాధాన్యం తగ్గించారంటూ విరుచుకుపడ్డారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్థిక లోటు భర్తీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. రూ.16వేల కోట్ల లోటుకు గాను రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన దానిపై ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. 

గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13 కోట్లు మాత్రమే కేటాయించారని, ఐఐటీ, నిట్‌, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, ఐజర్‌ లాంటి విద్యాసంస్థలకు ఒక్కపైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోలు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం బాధాకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.