తాను పార్టీ మారి తప్పు చేశానంటూ... కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం ఆయన సొంత గూటికి చేరారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయన... రాష్ట్ర విభజన తర్వాత ఆయన పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా... తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జీవితంలో పార్టీ వీడి తప్పు చేశానని కన్నీటి పర్యంతమయ్యారు. తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక తన జీవితం కడవరకూ పార్టీ వీడనన్నారు. చనిపోతే కాంగ్రెస్‌ కండువా వేయాలన్నారు. రాజంపేట పార్లమెంటు స్థానానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

అనంతరం కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ... నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సాయిప్రతాప్‌ తిరిగి పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. సాయిప్రతాప్‌ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వ్యక్తన్నారు. 

గాంధీ కుటుంబంతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా వైఎస్‌ సన్నిహితుడిగా పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ వీడారని, తిరిగి పార్టీలో చేరి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాననడం, రాహుల్‌ ప్రధాని కావాలని తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.