తిరుపతి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లా వెంకటగిరి, తిరుపతి ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని కేంద్ర మాజీ మంత్రి,  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చింతామోహన్ ప్రకటించారు. కాలజ్ఞాని పోతులూరి  వీరబ్రహ్మేంద్ర స్వామి 300 సంవత్సరాల క్రితమే రాసిన తాళపత్ర గ్రంధాల్లో వెంకటగిరి రాజధాని అవుతుందని అన్నారని తెలిపారు. ఆయన చెప్పినట్లే వెంకటగిరి ముఖ్య పట్టణం అవుతుందని చింతామోహన్ జోస్యం చెప్పారు. 

రాష్ట్ర విభజన సందర్భంగా తాను వెంకటగిరి,  తిరుపతి ని రాజధానిగా చెయ్యాలని అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి లేఖ రాశానని గుర్తుచేశారు. తన లేఖకు మన్మోహన్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అయితే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వెంకటగిరికి రావాల్సిన రాజధానిని చంద్రబాబు నాయుడు తుళ్ళూరు కి తీసుకెళ్ళారని అన్నారు. 

వీడియో

170 మంది దళితుల తలలు నరికి, వారి రక్తాన్ని ఏరులై పారించిన శపించబడ్డ స్థలం తుళ్ళూరులో ప్రధాని మోడీ చేత పునాది రాయి చంద్రబాబు నాయుడు వేయించారని అన్నారు.  అందుకే నేడు అమరావతి పునాది రాయి అనాది రాయిగా మిగిలిపోయిందన్నారు. తుళ్ళూరును రాజధానిగా ఎంపిక చెయ్యడం వల్లే నేడు అవరోధాలు వచ్చాయని... చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. తుళ్ళూరు లో అడుగు పెట్టిన మాజీ ముఖ్యమంత్రులు భవనం వెంకట్రామి రెడ్డి,  ఎన్టీ రామారావు,  అంజయ్య,  నాదెండ్ల భాస్కరరావు వంటి మహా నాయకులు తమ ముఖ్యమంత్రి పదవులను కోల్పోయి,  రాజకీయంగా కనుమరుగయ్యారని చెప్పారు. 

వెంకటగిరికి రాజధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.  అనువైన మంచి వాతావరణం,  నీటి  వసతి,  రోడ్డు,  రైలు మార్గం,  అంతర్జాతీయ విమానాశ్రయం ఉందన్నారు.  ఏర్పేడు నుంచి నెల్లూరు జిల్లా రాపూరు వరకు లక్ష ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నదని,  ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే,  భూ సమీకరణ,  భూ సేకరణ అవసరం ఉండని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకటగిరి,  తిరుపతిని రాజధానిగా ఎంపిక చేస్తామని, ఇది జరిగి తీరుతుందన్నారు చింతా మోహన్ పేర్కొన్నారు.