ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పరిస్థితులు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తోందని అన్నారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ పాలిటిక్స్ మొదలయ్యాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటేక్కాయి... అధికార నాయకుల మాటలు ఘాటెక్కాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి గెలుపుకోసం పనిచేసిన ప్రశాంత్ ఈసారి టిడిపి కోసం పనిచేయనున్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీంతో జనసేనతో పొత్తు కూడా తమను గెలిపించలేదనే భావనలో టిడిపి చీఫ్ వున్నట్లు... అందుకోసమే ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్లు ఓ ప్రచారం మొదలయ్యింది. ఇలాంటి కామెంట్స్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా పవన్ కల్యాణ్ ప్రాధాన్యం తగ్గిందా? అన్న అనుమానాలను ఐవైఆర్ వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితిలను చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అన్నారు. ఏపీ రాజకీయాలు పవన్ కల్యాణ్ చేతుల్లోంచి జారిపోతున్నట్లు వుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అసలు ఏపీలో ఏం జరుగుతోంది?
ఆంధ్ర ప్రదేశ్ లో మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సంసిద్దం అవుతున్నాయి. ఇప్పటికే తమ రాజకీయాలకు పదునుపెట్టి వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో టిడిపి ఓటమికి కారకుడని... వైసిపిని తన వ్యూహాలతో గెలిపించాడని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. గతంలో వైసిపిని గెలిపించినట్లే ఈసారి టిడిపి గెలిపించాలని ప్రశాంత్ కిషోర్ తో ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read Chandrababu Naidu: టీడీపీ ఆకర్ష్ ఆపరేషన్ స్టార్ట్?.. చంద్రబాబు వ్యాఖ్యల మర్మం ఏమిటీ?
మరోవైపు ఏపీకి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం వున్న నాయకుడు రాష్ట్రానికి అవసరం... కాబట్టి చంద్రబాబే మళ్ళీ సీఎం అవుతారనని అన్నారు. ఈ విషయంలో రెండో మాట వుండబోదన్నారు. తమతో పొత్తులో వున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. ఇలా ఒక్కమాటతో పవన్ ముఖ్యమంత్రి అవుతారని జనసైనికులు ఏ మూలనో పెట్టుకున్న ఆశలపై లోకేష్ నీళ్ళు చల్లారు.
ఇలా టిడిపి ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించడం, లోకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ పై టిడిపికి పెద్దగా నమ్మకం పెట్టుకోలేదని అర్థం అవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రభావం అంతగా వుండకపోవచ్చని టిడిపి నాయకత్వం భావిస్తున్నట్లుంది. అందువల్లే పొత్తులో వున్న పీకే కంటే బిహారీ పీకే పైనే టిడిపి నమ్మకం పెట్టుకుందని... అతడే తమను గెలిపించగలడని నమ్మి ఒప్పందం చేసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే అభిప్రాయాన్ని మాజీ సీఎం ఐవైఆర్ కూడా వ్యక్తం చేసారు.
