Chandrababu Naidu: టీడీపీ ఆకర్ష్ ఆపరేషన్ స్టార్ట్?.. చంద్రబాబు వ్యాఖ్యల మర్మం ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆకర్ష్ ఆపరేషన్ మొదలు పెట్టిందా? పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తామని చంద్రబాబు అన్నారు. తటస్థులను ఆహ్వానిస్తామని వివరించారు.
Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలా? అనే వ్యూహాలు రచిస్తూ.. మార్పులు చేర్పులు చేసుకుంటున్నది. టీడీపీ కూడా దూకుడు పెంచింది. సాధారణంగా టికెట్లు ప్రకటించడానికి ముందు పార్టీల సమీకరణాలు, నాయకుల జంపింగ్‌లు కనిపిస్తూ ఉంటాయి. నాయకులు మంచి ప్రత్యామ్నాయంగా కనిపించే పార్టీల్లోకి వెళ్లిపోతుంటారు. పార్టీల అధినేతలు కూడా ఈ ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఇతర పార్టీల నేతల కోసం గాలం వేస్తున్నారు.
మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తామని చంద్రబాబు అన్నారు. అయితే, వారు తటస్థులుగా ఉండాలని, కటువుగా వ్యాఖ్యలు చేసి ఉండకూడదని తెలిపారు. అలాంటి వారిని తప్పకుండా పార్టీలోకి చేర్చుకుంటామని వివరించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలు ఏపక్షంగా జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. ఏపీ పై రాహుల్ గాంధీ ఫోకస్, ఈ నెల 27 న ఆంధ్రా నేతలతో కీలక భేటీ
సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే టీడీపీ ఎప్పుడో ఇచ్చిన హామీలను జగన్ కాపీ కొడుతున్నాడని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ తాము ప్రకటించామని, ఇప్పుడు వైసీపీ అదే హామీని అమలు చేయాలని చూస్తున్నదని పేర్కొన్నారు. మరి నిత్యావసరాలు, అధిక ధరలు, బిల్లుల సంగతి ఏమిటని నిలదీశారు.