జగన్ రెడ్డి పాలనలో చేస్తున్న అప్పుల వల్ల ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై లక్ష రూపాయల భారం పడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి: వైసిపి ప్రభుత్వానికి పాలన చేతగాకే ఏపీ ప్రజలపై భారం మోపుతోందని ప్రతిపక్ష టిడిపి (TDP) ఆరోపిస్తోంది. కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రో ధరలు పెంపు చివరకు చెత్తపై పన్ను విధిస్తూ ప్రభుత్వమే ప్రజలను దోచుకుంటోందని... ఈ విషయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రతిఒక్కరికి తెలియజేయాలని టిడిపి నిర్ణయించింది. ఈ క్రమంలోనే ''బాదుడే బాదుడు'' పేరుతో ప్రజల్లోకి వెళ్లి వైసిపి పాలనలో ఎలా దోపిడీకి గురవుతున్నారో అవగాహన కల్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ వ్యూహకమిటీ శ్రీకారం చుట్టింది.
తాజాగా ఈ కార్యక్రమంపై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సోషల్ మీడియా వేదికన స్పందించారు. ''గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం...ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. చెత్త పన్నులు, పెరిగిన కరెంటు చార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడి సరేసరి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.
''వైసీపీ సర్కార్ బాదుడే బాదుడు విధానంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకు పైగా భారం పడుతోంది. మీ కష్టార్జితాన్ని పిండుకుని... తాను దర్జాగా దండుకుంటున్న జగన్ పాలనపై ప్రజలు పోరాడాలి. తాను చేసే అప్పుల కోసం మీ జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలి'' అని సూచించారు.
''పథకాల పేరుతో ప్రజలు నుంచి పిండిన దాంట్లో 10 శాతం మీకిచ్చి... మిగతా 90 శాతం తమ జేబుల్లో వేసుకుంటున్న దోపిడీని ప్రశ్నించాలి. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై ప్రతిపక్ష తెలుగుదేశం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. ప్రభుత్వ మెడలు వంచేందుకు ప్రజలంతా తెలుగుదేశంతో కలిసిసాగండి'' అని చంద్రబాబు రాష్ట్ర ప్రజానికాన్ని కోరారు.
ఇదిలావుంటే నిన్న(సోమవారం) జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కూడా చంద్రబాబు వైసిపి సర్కార్ పాలనపై మండిపడ్డారు. సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయని... ఇదే కొనసాగితే శ్రీలంక మాదిరిగా ఏపీలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవల ప్రధాని మోదీతో ఉన్నతాధికారుల వ్యాఖ్యలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అద్వాన్నంగా వుందో అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు.
ఇక నూతన జిల్లాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని... ఏమాత్రం శాస్త్రీయ పద్దతిలో జరగలేదన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్దతిలో జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.
ఇక కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బాద్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలపక్షాన నిలబడి పోరాడుతామన్నారు. కరెంట్ ఎందుకు పోతోందో... బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలన్నారు. కేవలం తన వ్యక్తిగత ఆదాయం కోసమే సీఎం జగన్ యావత్ రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పక్షాన నిలిచి ఓటేసినందుకు బాధపడుతున్నారన్నారు. జగన్ కు ఓటేసి అధికారాన్ని కట్టబెట్టి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉందని చంద్రబాబు అన్నారు.
