ఇంటికి కేజీ బంగారమిచ్చినా ఓటమి తప్పదు జగన్ - నారా లోకేష్
ఏపీలో ఉన్న ప్రతీ ఇంటికీ కేజీ బంగారం ఇచ్చినా వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచక పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీపై, ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా కూడా గెలవడం అసాధ్యం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
‘‘అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం.. జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
‘‘రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్ ను అధికారులు పట్టుకున్నారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు...మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలి.’’ అని తెలిపారు.