కల్యాణ్ కు క్యాష్ ట్రాన్సఫర్ అయినా.. బాబు కు కాస్ట్ ఓట్స్ ట్రాన్సఫర్ కావు - అంబటి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు మరో సారి విరుచుకుపడ్డారు. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్ట్ విడులైన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ కు క్యాష్ ట్రాన్స్ ఫర్ అయినా.. చంద్రబాబు నాయుడికి మాత్రం కాస్ట్ ఓట్లు ట్రాన్స్ ఫర్ కావని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దాని కోసం సన్నదమవుతున్నాయి. అధికార వైసీపీ మూడు లిస్టులు విడుదల చేసి ఆయా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించింది. ఇటీవల టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. మరో వైపు కాంగ్రెస్ కూడా ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని విడుదల చేసింది.
అయితే ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి 94, జనసేనకు 24 దక్కాయి. ఈ సారి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని భావించిన జనసేన కేవలం 24 సీట్లకే పరిమితం కావడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జన సైనికులు కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులైతే జనసేనపై, ఆ పార్టీ అధినేతపై సెటైర్లు వస్తున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైన రోజే వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ‘‘పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇదే విషయంలో మరో ట్వీట్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కల్యాణ్ కి క్యాష్ ట్రాన్సఫర్ అవుతుంది..కానీ బాబుకి కాస్ట్ ఓటు మాత్రం ట్రాన్సఫర్ కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా జనసేనకు తక్కువ సీట్లు రావడంపై ట్వీట్ చేశారు. జనసేనకు 23 సీట్లు ఇస్తే, అది టీడీపీ లక్కీ నెంబర్ అంటారు. అదే 25 సీట్లు ఇస్తే పవన్‌ను పావలా సీట్లు ఇచ్చారని అంటారు. అందుకే మధ్యే మార్గంలో 24 సీట్లు ఇచ్చారు’’ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కూడా ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటీ.. ఆ పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా వుందా ? జనసేన శక్తిని పవన్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారు.. 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదు. రాజ్యాధికారంలో వాళ్లు వాటా కోరుకుంటున్నారు’’ అని ఆయన లేఖ రాశారు.