విశాఖపట్నం: మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈఎస్ఐ అనేది కేంద్రం ఆదీనంలోని సంస్థ అని... అందులో రాష్ట్ర మంత్రుల పాత్ర ఏమీ వుండదన్నారు.   

''బీసీ నేత అచ్చెన్నాయుడు పై జగన్ కక్ష కట్టి అరెస్ట్ చేయించారు. ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం అనేది కేవలం లోకల్ మోనిటరింగ్ వ్యవస్థ మాత్రమే. వాటి లావాదేవీల్లో మంత్రుల పాత్ర ఏమీ ఉండదు'' అని అయ్యన్న వివరించారు. 

''2012 లో విడుదలైన జీఓ ప్రకారం చూసినా ఈఎస్ఐ డైరెక్టర్ మాత్రమే బాద్యుడు. ఇదే తరహా మోసం తెలంగాణా లోను జరిగింది అక్కడా ఇక్కడా కేవలం ఈఎస్ఐ అధికారులను బాద్యులుగా చూపించారు'' అని గుర్తుచేశారు. 

''రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్మెంట్లో కూడా 4 డాక్టర్లను బాద్యులుగా చూపించారు. అందులో అచ్చెన్నాయుడు పేరు లేదు. అలాంటప్పుడు అచ్చెన్నాయుడు మీద పెట్టిన కేసు అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు'' అంటూ వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. 

read more    గేట్లు దూకి ఇంట్లోకి వచ్చారు, ఆరోగ్యం బాగాలేదు: అచ్చెన్నాయుడు భార్య మాధవి

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని సొంత గ్రామం నిమ్మాడలో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణం జరగడం... ఈ స్కాంతో ఆయనకు సంబంధాలున్నట్లు తేలడంతో ఏసిబి పోలీసులుఅరెస్ట్ చేసినట్లు సమాచారం. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల  మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. కొనుగోళ్ల టెండరింగులో అచ్చెన్నాయుడి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.