అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి విషయంలో రాత్రికి రాత్రే కొత్త పరిణామం చోటు చేసుకుంది. అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంంది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

చికిత్స పొందుతున్న అచ్చెనాయుడిని ఆస్పత్రిలోనే న్యాయవాది, వైద్యుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీద పడుకుని సమాధానాలు ఇవ్వవచ్చునని కూడా స్పష్టం చేసింది. కూర్చోమని గానీ నిలుచోమని గానీ ఆయనను అడగకూడదని కూడా కోర్టు ఏసీబీ అధికారులకు చెప్పింది. 

Also Read: ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు: ఆస్పత్రిలోనే విచారణ

గుంటూరు జనరల్ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని న్యాయమూర్తి వాటిని పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో ఆయనను డిశ్చార్జీ చేయవచ్చునని వైద్యులు చెప్పారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని ఏసీబీ అధికారులకు సూచించింది. 

అయితే, బుధవారం అర్థరాత్రి పరిణామాలు మారిపోయాయి. అచ్చెన్నాయుడిని గురువారమే డిశ్చార్జీ చేసేందుకు ఆస్పత్రి వర్గాలు సిద్దం చేసినట్లు తమకు తెలిసిందని అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాదులు చెప్పారు. తనను చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ  ఆస్పత్రికి తరలించాలనే అచ్చెన్నాయుడిని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 

Also Read: చంద్రబాబు విలవిల: కేసుల చిక్కుల్లో కొమ్ములు తిరిగిన నేతలు

అచ్చెన్నాయుడిని గురువారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, పోలీసులు అధికారులు బుధవారం అర్థరాత్రి ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. అచ్చెన్నాయుడిని డిశ్చార్జీ చేయబోతున్నారనే సమాచారంతో బుధవారం రాత్రి జిజిహెచ్ కు వెళ్లి మాట్లాడామని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు చెప్పారు అర్థరాత్రి డిశ్చార్జీ పత్రం ఎలా ఇస్తారని అడిగితే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.