కర్నూలు జిల్లాలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపుతున్నాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, అయ్యలూరు, కానాలలో పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇస్లాం అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పలుమార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చినవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులకు దిగింది. వారి ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ మధ్యనే సౌదీ వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోదాలు చేస్తున్న వారి ఇళ్లముందు భారీగా కేంద్ర బలగాలు కూడా మోహరించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు జరుపుతున్నారో తెలపాలంటూ పోలీసులు, అధికారులతో సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఆర్ఎస్ఎస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొత్తుగా వ్యవహరిస్తోందంటూ వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఈడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.