విశాఖపట్నం:  విశాఖపట్నం జిల్లా మన్యం మరోసారి తుపాకీగుళ్ల  మోతతో ఉలిక్కిపడింది. ఏవోబీలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మందపల్లిలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 

ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మందపల్లిలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈనేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇకపోతే ఘటనాస్థలం వద్ద పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. 

ఇకపోతే ఈ ఎన్ కౌంటర్ లో ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ కు చెందిన ఈస్ట్ డివిజన్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఈస్ట్ డివిజన్ సీపీఐ మావోయిస్ట్ దళాన్ని విశాఖ ఏజెన్సీ జీకే వీధికి చెందిన వెంకట రవిచైతన్య అలియాస్ అరుణ నడుపుతున్నట్లు సమాచారం. 

ఇకపోతే ఇటీవలే ఈ దళానికి చెందిన ఏరియా కమిటీ మెంబర్ నవీన్, అతని భార్య జీవని, మరోక ఏరియాకమిటీ మెంబర్ కొర్రా వెంకటరావు అలియాస్ టెక్ శ్రీకాంత్ లు విశాఖ రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.