నరసరావుపేట పట్టణంలోని తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాలు. ప్రారంభించిన స్వీక‌ర్ కొడెల శివ‌ప్ర‌సాద‌రావు, క్రీడా శాఖ మంత్రి కోల్లు రవీంద్ర‌. మ‌రో 5 స్పోర్ట్స్ అకాడమీలను, 4వాటర్ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు.

నరసరావుపేట పట్టణంలోని తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు స్వీక‌ర్ కొడెల శివ‌ప్ర‌సాద‌రావు, క్రీడా శాఖ మంత్రి కోల్లు రవీంద్ర‌. ఈ సందర్భంగా శివప్రసాదరావు మాట్లాడుతూ గ‌తంలో ఇక్క‌డి ప్రాంతం అంతా మురికితో నిండి ఉండేద‌ని, ప్ర‌స్తుతం ఇక్క‌డంతా విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంటుందన్నారు. ముఖ్య‌మంత్రి స‌హాకారంతో ఈ స్టేడియం నిర్మాణం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. వర్షాలు వ‌స్తే ఆట‌గాళ్ల‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా టెన్నీస్ సింథటిక్ కోర్టు, 400మీ వాకింగ్ సింథటిక్ ట్రాక్ నిర్మించనున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో స్టేడియానికి 100పడకల హస్టల్ నిర్మించ‌బోతున్నామన్నారు. త్వ‌ర‌లో కబడ్డీ, వాలీబాల్ అకాడమీల ఏర్పాటుకు కూడా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.


మంత్రి కోల్లు రవీంద్ర మాట్లాడుతూ నరసరావుపేటలో నూత‌న స్టేడియం ప్రారంభం అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 6 అకాడమీలలో ఒకటి నరసరావుపేటకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల‌ను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దంచేస్తుంద‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మ‌రో 5 స్పోర్ట్స్ అకాడమీలను, 4వాటర్ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న‌ 175 నియోజకవర్గాల్లో ఒక్కోనియోజకవర్గంలో రెండు కోట్ల వ్యయంతో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి తెలిపారు.