ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలను చెల్లిస్తున్నారని.. చివరికి మాజీ ఎమ్మెల్యేలకు కూడా సమయానికి పెన్షన్ ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు . మంగళవారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశానికి వెళ్లేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలను చెల్లిస్తున్నారని, మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు వేయడం లేదని బొప్పరాజు ప్రశ్నించారు. చివరికి మాజీ ఎమ్మెల్యేలకు కూడా సమయానికి పెన్షన్ ఇస్తున్నారని.. మరి మాకెందుకు ఇవ్వడం లేదని వెంకటేశ్వర్లు నిలదీశారు. సీపీఎస్ రద్దు చేయమని అడిగితే కనీసం స్పందించడం లేదని.. ప్రభుత్వం చెప్పే మాటలు తాము వినేది లేదన్నారు. 

26 జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై కార్యాచరణపై చర్చిస్తామని బొప్పరాజు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 9 నుంచి ఉద్యమం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. ఏపీ ఎన్జీవోలతో మాట్లాడేందుకు పలుమార్లు ఆహ్వానాలు పంపామని కానీ.. వారు స్పందించలేదని బొప్పరాజు స్పష్టం చేశారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంకటేశ్వర్లు వెల్లడించారు. అయితే ఉద్యోగులు ఉద్యోమంలోకి వెళ్లేలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also REad: మంత్రులతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: ఆర్ధిక అంశాలపై స్పష్టతకు పట్టు

అంతముందు ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలవడంతో ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కొన్ని తాబేదార్ సంఘాలు తమ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని సూర్యనారాయణ మండిపడ్డారు. కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ ను నిర్వీర్యపరచాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం ద్వారా భయపెట్టాలని చూసిందని.. తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూసిందని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాణిజ్య పన్నులశాఖ పునర్వ్యవస్థీకరణ అంతా గందరగోళం చేశారని.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి శాఖ పునర్వ్యవస్థీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది అధికారుల కోసం ఇష్టానుసారం శాఖ విభజన చేశారని సూర్యనారాయణ దుయ్యబట్టారు. క్రమశిక్షణ చర్యల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఇబ్బంది పెడుతోందని.. శాఖలో అవకతవకలపై లోకాయుక్త తో విచారణ జరపాలని తీర్మానం చేసినట్లు సూర్యనారాయణ తెలిపారు.