ఓ నిర్ణయం తీసుకోవటం తర్వాత అమలుకు ఉద్యోగులపై ఒత్తిడి పెట్టటం సిఎంకు అలవాటుగా మారిపోయింది.

నిర్ణయాలు తీసుకోవటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రధానమంత్రి నరేంద్రమోడిని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ఏదో ఓ నిర్ణయం తీసుకోవటం తర్వాత అమలుకు ఉద్యోగులపై ఒత్తిడి పెట్టటం సిఎంకు అలవాటుగా మారిపోయింది. తన నిర్ణయాలపై ఉద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నది ఆలోచించటం లేదు.

తాజాగా ఉద్యోగుల అటెండన్స్ కోసం బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత కనిపిస్తున్నా చంద్రబాబు లెక్క చేయటం లేదు.

పదేళ్ళ పాటు అవకాశం ఉన్నప్పటికీ హైదరాబాద్ లోని సచివాలయంను సిఎం అర్ధాంతరంగా ఖాళీ చేసారు. ఎటువంటి సౌకర్యాలు లేని వెలగపూడికి తరలాల్సి రావటంతో ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. సౌకర్యాలు కల్పించిన తర్వాత తమను తరలించమని ఉద్యోగులు ఎంతమొత్తుకున్నా పట్టించుకోలేదు.

వెలగపూడికి తరలింపు తప్పదని తేలగానే ఉద్యోగుల్లో నైరాస్య మొదలైంది. కొందరు వెలగపూడిలో, మరికొందరు హైదరాబాద్లో కొంతకాలం కాలక్షేపం చేసారు. దాంతో నెలల పాటు పాలన పడకేసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.

చివరకు ఉద్యోగులు వెలగపూడికి వెళ్ళక తప్పలేదు. అసలే అరాకొరా సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు బయెమెట్రిక్ విధానం అమలు చేస్తామనటంతో చిర్రెత్తుతోంది. బయోమెట్రిక్ విధానాన్ని జనవరి 1వ తేదీ నుండి అమలు చేయాలని సిఎం నిర్ణయించారు.

సచివాలయంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కనీసం సగం మంది వేలిముద్రలను కూడా ఐటి శాఖ సేకరించలేదు. ఇక మిగిలింది కేవలం మూడు రోజులు మాత్రమే. మూడు రోజుల్లో మిగిలిన వారి వేలి ముద్రలు సేకరించటం ఎలా సాధ్యమో చంద్రబాబుకే తెలియాలి.

పేరుకు తాత్కాలిక సచివాలయమే గానీ అక్కడ ఉద్యోగులెవరూ ఉండేందుకు అవకాశం లేదు. దాంతో ఉద్యోగుల్లో ఎక్కువమంది విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి నుండే షటిల్ చేస్తున్నారు. బయటప్రాంతాల నుండి వెలగపూడికి నేరుగా బస్సులూ లేవు.

దాంతో వెలగపూడికి చేరుకోవాల్సిన ఉద్యోగులు బయటప్రాంతాల నుండి అంచెలంచెలుగా చేరుకుంటున్నారు.

ఫలితంగా సచివాలయంకు సకాలంలో చేరుకోవటం సాధ్యం కావటం లేదు. ఈ విషయాలేవి చంద్రబాబుకు తెలీక కాదు. తెలిసినా సరే తన మాట నెగ్గాలన్న పట్టుదలతో ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమలుపై పట్టుపడుతున్నారు. దాంతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ఇదే విషయమై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల నుండి వెలగపూడికి నేరుగా బస్సు సౌకర్యాలు లేకపోవటం ఉద్యోగులకు ఇబ్బందిగా ఉందన్నారు. కాబట్టి బయోమెట్రిక్ విధానం అమలును కొద్ది కాలం వాయిదా వేయాలని సిఎంను అడగనున్నట్లు చెప్పారు.