ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వణుకు పుట్టిస్తున్న వింత వ్యాధికి గల కారణాలు తెలిసివస్తున్నాయి. ఈ అంతుచిక్కని రోగంపై వివిధ సంస్థలు, ప్రభుత్వం నివేదికలను తయారు చేశాయి. బాధితుల శరీరంలో లెడ్, నికెల్ అవశేషాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. పాల ద్వారా గానీ పురుగుల మందు ద్వారా గానీ అవి శరీరంలో చేరి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే, ఆ నివేదిక అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 

న్యూరో టాక్జిన్స్ వల్ల వింత వ్యాధి వ్యాపించి ఉండవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్ ప్రభావం చూపుతున్నట్లు భావిస్తున్నారు. బాధితుల్లో కంటికి సంబంధించిన ల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు వైద్య పరిభాషలో దాన్ని ప్యూపిల్ డైలటేషన్ అంటారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చునని గుంటూరు వైద్య బృందం అనుమానిస్తోంది. 

రోగుల్లో నోటి వెంట నురుగ, తలనొప్పి, స్పృహ తప్పిపడిపోవడం వంటి మూర్ఛ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాన్నే మయో క్లోనిక్ ఎపిలెప్సీ అంటారు. ఇటువంటి లక్షణాలు బయటపడిన ఐదుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆదివారంనాడు గుంటూరు జిజీహెచ్ కు తరలించారు  పడవల చలపతిరావు, పి. సాంబులింగాచారి, కాయల కుసుమకుమారి, పడ్డా రమణమ్మ, మాజేటీ లక్ష్మీ కుమారి ఆండాళ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

ఏలూరులో వింత వ్యాధితో వందలాది మంంది అస్వస్థతకు గురవుతున్న వైనంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టర్ తో మాట్లాడారు. తర్వాత కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడారు. ఎయిమ్స్ వైద్య బృందంతోనూ ఆయన చర్చించారు.