హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరో నలుగురు అంతు చిక్కని వింత వ్యాధికి గురయ్యారు. గురువారంనాడు వింత వ్యాధితో మరో నలుగురు ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు మొత్తం 591 కేసులు నమోదయ్యాయి. 

మాయరోగానికి చికిత్స పొంది 515 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 47 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 33 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా వింత వ్యాధితో మరో ఇద్దరు మరణించారు. ఇంతకు ముందు ఒక్కరు మరణించారు.. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది.

ఇదిలావంటే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వింత వ్యాధికి కారణంపై వైద్య వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. క్రిమిసంహారక మందుల్లోని ఆర్గానో క్లోరిన్ కారణంగానే వింత వ్యాధి ప్రబలినట్లు ఓ అంచనాకు వచ్చాయి. బాధితుల రక్తంలో సీసం, నికెల్ వంటి లోహాలున్నట్లు ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరీక్షల్లో నిర్ధారణ అయింది. వీటీకి అదనంగా ఆర్గానో క్లోరిన్ కలిసిన కారణంగానే మూర్ఛ, ఇతర అనారోగ్య సమస్యలు బాధితుల్లో తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆర్గానో క్లోరిన్ నీటిలో లేదా పాలలో కలిసేందుకు వీలుందా, దానికి కారణాలేమిటినే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. బ్యాటరీల రీసైక్లింగ్ లో భాగంగా సీసం నేలలో కలిసి ఉండవచ్చునని, కూరగాయాలు, ధాన్యం వంటి వాటి ద్వారా మనుషుల శరీరంలో చేరి ఉండవచ్చునని అంటున్నారు. ఆర్గానో క్లోరిన్ ప్రభావం వల్లనే అని తేలితే వ్యాధికి మూలాలు తెలుస్తాయని అంటున్నారు. 

శుక్రవారంనాటికి దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా దానిపై చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఏలూరులో అంతు చిక్కని వ్యాధి మూలాల నిర్ధారణ కోసం బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ఢిల్లీ ఎయిమ్స్ బృందం రెండు సార్లు పరీక్షించింది. సీసం, నికెల్ లోహాలున్నట్లు ఆ పరీక్షల్లోనే తేలింది. ఐఐసిటీ పరీక్షల్లోనూ అదే విషయం తేలింది. 

కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, నీరు, నూనే వంటి పదార్థాలను నమూనాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరీక్షిస్తోంది. ప్రాథమిక నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందిస్తుంది. కూరగాయల సాగులోనూ ఆర్గానో క్లోరిన్ కలిసి ఉండవచ్చుననేది ఓ అంచనా. కూరగాయల పంటలపై క్రిమిసంహారకాలను చల్లినప్పుడు వాటిని పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చునని అంటున్నారు. గడ్డిపై క్రిమిసంహారక మందులు పడినప్పుడు దాన్ని తిన్న పశువుల ద్వారా కూడా ఆర్గానో క్లోరిన్ మనుషుల శరీరాల్లోకి రావచ్చునని అంటున్నారు. 

ఆర్గానో క్లోరిన్ శరీరంలోకి వెళ్తే మూర్ఛ, తలనొప్పి, తల తిప్పడం, వాంతులు, వికారం, అవయవాలు కొట్టుకోవడం, వణుకు రావడం, తికమకగా వ్యవహరిస్తుండడం, మాటల తడబడడం, కండరాల బలహీనత, నోటి నుంచి చొంగ కారడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. 

దీర్షకాలికంగా కాలేయం, మూత్రపిండాలు, కేంద్ర నాడీ వ్యవస్థలపై అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఏలూరులో వింత వ్యాధికి గురవుతున్నవారిలో అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆర్గానో క్లోరిన్ వల్లనే ఏలూరులో వింత వ్యాధి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా బ్లీచింగ్, క్లోరిన్ పౌడర్లను చల్లుతున్నారు. అవేమైనా వ్యాధికి కారణమయ్యాయా అనే కోణంలో కూడా పరిశీలన జరుగుతోంది. 

కేంద్రం నుంచి ఏలూరు వచ్చిన జాతీయ పరిశోధన సంస్థల బృందం పశువుల నుంచి కూడా నమూనాలను సేకరించి పరీక్షలు చేయనుంది. ఏలూరు పరిశ్రమల మధ్య ఉంది. అవేమైనా కారణమై ఉండవచ్చునా అనేది కూడా పరిశీలించారు. అయితే, అవి నగరానికి దూరంగా ఉన్నాయి. అందువల్ల వాటి కాలుష్యం కారణమై ఉండకపోవచ్చునని అంటున్నారు.