ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరోసారి వింత వ్యాధి కలకలం చెలరేగింది. కొత్తగా బుధవారం ఉదయం మరో 8 కేసులు నమోదయ్యాయి. ఫిట్స్ వచ్చి సొమ్మసిల్లి పడిపోయారని బంధువులు చెబుతున్నారు. ఏలూరులోని తంగెళ్లమూడి, తూర్పు వీధి, పడమట వీధి, శంకరమఠం ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి..

దాంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వింత వ్యాధికి చికిత్స పొందుతున్నవారి సంఖ్య 72కు చేరుకుంది. సీసీఎంబీకి పంపించిన శాంపిల్స్ పరీక్షల ఫలితాలు ఈ సాయంత్రానికి రావచ్చునని భావిస్తున్నారు.  వింత వ్యాధి రోగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

Also Read: ఏలూరులో 572కు చేరిన రోగుల సంఖ్య: తుది నిర్ధారణకు రాలేదని మోహన్

ఇన్ ఫెక్షన్స్ కు సంబంధించిన పరీక్షల ఫలితాలు నెగెటివ్ వచ్చాయని, అందువల్ల ఇన్ ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకిందని భావించడానికి వీలు లేదని ఏలూరు ఆస్పత్రి సూపరింటిండెంట్ అంటున్నారు.  లెడ్, నికెల్ అవశేషాల లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

పాలు, ఆహారం, నీళ్లలో వ్యాధి కారకాలు ఉండవచ్చునని ఆయన అన్నారు. చాలా మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధికి అసలు కారణమేమిటనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. ఈ సాయంత్రానికి చాలా శాంపిల్స్ ఫలితాలు వస్తాయని, ఆ ఫలితాల్లో కారణాలు తెలిసే అవకాశాలుంటాయని ఆయన చెప్పారు.