Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో 572కు చేరిన రోగుల సంఖ్య: తుది నిర్ధారణకు రాలేదని మోహన్

ఏలూరులో మాయరోగం బాధితుల సంఖ్య 556కు చేరుకుంది. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియా పరిశీలనకు 22 నీటి నమూనాలను సేకరించగా వాటిలో పురుగుమందుల అవశేషాలున్నట్లు గుర్తించారు. 

Eluru mystery disease: Victims number reaches to 556
Author
Eluru, First Published Dec 9, 2020, 7:30 AM IST

ఏలూరు: ఏలూరు మాయరోగం బాధితుల సంఖ్య 572కు చేరుకుంది. వారిలో 500 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 70 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య మంగళవారం సాయంత్రానికి  556కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ చేశారు. మెరుగైన చికిత్స కోసం ఇప్పటివరకు 30 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. 

ఇ-కొలి లాంటి బ్యాక్టీరియా పరిశీలనకు 22 నీటి నమూనాలను సేకరించగా వాటిలో పురుగుమందుల అవశేషాలున్నట్లు గుర్తించారు. మొత్తం 62 నమూనాలు సేకరించగా వాటిలో 10 నమూనాల్లో పరిమితికి మించి సీసం, నికెల్ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 40 నమూనాలను దిల్లీలోని ఎయిమ్స్‌కు పంపినట్లు వెల్లడించింది. 

వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్‌ పరీక్షల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. కూరగాయల నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌కు.. కణజాల పరీక్ష కోసం 10 నమూనాలను సీసీఎంబీకి పంపామని వివరించింది. దీంతో పాటు రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలను పంపినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

: నీటి కల్చర్ టెస్ట్ నివేదిక నెగిటివ్ వచ్చిందని ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలు లేదా రసాయనాలు లేదా న్యూరో టాక్జిన్స్ కారణం కావచ్చు అని భావిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ బృందం ఇచ్చిన నివేదికలో బాధితుల రక్తంలో సీసం, నికెల్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. తుది నిర్థారణ కోసం మరిన్ని నమూనాలు పంపమని ఎయిమ్స్ కోరిందని, 40 బ్లడ్ శాంపిల్స్ పంపించినట్లు వెల్లడించారు. 

ఇక సీసీఎంబీకి పంపిన కణజాలానికి సంబంధించి పది శాంపిల్స్ పంపించినట్లు తెలిపారు. నివేదిక రావాల్సి ఉందన్నారు. అలాగే రసాయనాల విశ్లేషణకు ఐఐసీటీకి నమూనాలు పంపించామని, నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. ఈ రోజు ఎన్‌ఐఎన్ బృందం,  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు వెల్లడించారు. 

ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ కూడా కేంద్రం నుంచి ఈ రోజు వచ్చిందన్నారు. ఏలూరు ఆసుపత్రికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు,  న్యూరాలజిస్ట్‌లు కూడా రానున్నట్లు ఏవీఆర్ మోహన్ తెలిపారు.

ఏలూరు బాధితుల స్టేట్‌మెంట్‌ నమోదు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్‌మెంట్‌ను జిల్లా న్యాయమూర్తి భీమారావు నమోదు చేశారు. 

ఫిట్స్‌తో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరినట్లు వివరించారు. లెడ్‌, నికెల్‌ కారకాలున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధుల ద్వారా తెలిసిందన్నారు. ఎయిమ్స్‌ నివేదిక వచ్చాక కారణాలు విశ్లేషించి హైకోర్టుకు పూర్తిస్థాయిలో నివేదించనున్నట్లు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios