ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కొనుగోలు మరుసటి రోజే చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలి.. ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడలోని సూర్యరావుపేట గులాబీ తోటలో చోటుచేసుకుంది. 

దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. దీంతో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. అయితే వరుసగా ఎలక్ట్రిక్ బైక్‌లు పేలడం వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్‌ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. సూర్యరావుపేటలో గులాబీ తోటలో నివాసం ఉంటున్న సూర్యకుమార్.. నిన్ననే కొత్త ఎలక్ట్రిక్ కొన్నాడు. ఇంట్లోని బెడ్ రూమ్‌లో బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టాడు. 

అయితే తెల్లవారుజామున బ్యాటరీ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో శివకుమార్‌తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. అయితే మంటలు గమనించిన కొందరు స్థానికులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. వారిని బయటకు తీసుకొచ్చి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శివకుమార్ మృతిచెందాడు. అయితే ప్రస్తుతం అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. సూర్యకుమార్ ఇద్దరు పిల్లలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.