ఎన్నికల్లో ప్రచారానికి ప్రతిపక్షాలకు ఎటు తిరిగీ కావాల్సినన్ని అంశాలుంటాయి. మరి, నిజంగానే ఎన్నికలు జరిగితే అధికారపక్షంగా ఓటర్లకు ఏమని చెప్పి ఓట్లు అడగాలన్న విషయంలో నేతలు గింజుకుంటున్నారు.

వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి చంద్రబాబు ఓట్లు అడుగుతారు? సాధారణ ఎన్నికలంటే మరో రెండున్నరేళ్ల కాలం ఉంది. మరి, త్వరలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల మాటేమిటి? గతంలో న్యాయస్ధానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వచ్చే నెలలోపు ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లు, ఐదు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో గెలవటమంటే చంద్రబాబుకు ఎంతో ప్రతిష్టాత్మకం.

మున్సిపల్ ఎన్నికలేకదా ఎందుకు ప్రతిష్టాత్మకమంటే రాష్ట్రంలో పరిస్ధితులు అలా తయారయ్యాయి. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, కర్నూలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. కార్పొరేషన్ల జాబితా చూస్తుంటేనే ఎంత ప్రాధాన్యత కలిగినవో వేరే చెప్పక్కర్లేదు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, కోస్తా జిల్లాల్లోని కాకినాడ, ఒంగోలు,నెల్లూరు. ఇక రాజధాని జిల్లా గుంటూరు కేంద్రం కార్పొరేషన్ కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదేవిధంగా, రాయలసీమలోని తిరుపతి, కర్నూలు కార్పొరేషన్ల గురించి వేరే చెప్పక్కర్లేదు.

 ఒకవైపు ఎన్నికలు జరుగుతాయో తెలీదు కానీ పార్టీ యంత్రాంగం మొత్తం కిందా మీదా పడుతున్నది. మొత్తం 11 మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపినే గెలవాలని చంద్రబాబు పార్టీ యంత్రాంగానికి లక్ష్యాలను నిర్దేశించారు. దాంతో పై మున్సిపలిటీల్లో ఓటర్ల జాబిత తయారీలో అధికార పార్టీ నేతల జోక్యం బాగా పెరిగిపోయింది. దాంతో ప్రతిపక్షాలు టిడిపి నేతల జోక్యంపై విరుచుకుపడుతున్నాయి.

ఎన్నికల్లో ప్రచారానికి ప్రతిపక్షాలకు ఎటు తిరిగీ కావాల్సినన్ని అంశాలుంటాయి. మరి, నిజంగానే ఎన్నికలు జరిగితే అధికారపక్షంగా ఓటర్లకు ఏమని చెప్పి ఓట్లు అడగాలన్న విషయంలో నేతలు గింజుకుంటున్నారు. పైన పేర్కొన్న కార్పొరేషన్లలో ఏ ఒక్క దానిలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ది జరగలేదన్నది వాస్తవం. పై పెచ్చు క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నది నేతల మాట.

అందులోనూ ఫిరాయింపులను ప్రోత్సహించి వైసీపీ ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కున్నారన్న అపఖ్యాతి ఒకటి వెంటాడుతోంది. దానికితోడు రాజధాని పేరుతో ఓట్లు అడగటినికి కూదా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు. పైగా అమరావతి పేరుతో జరుగుతున్న గందరగోళం అంతా ఇంతా కాదు. అమరావతి పేరుతో పచ్చనేతల ఆగడాలు,అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

 ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయడుకు ఇటు ఉన్నతాధికారులపైన అటు పార్టీ నేతలపైన అసహనం పేరుకుపోతున్నట్లు సమాచారం. రాజధాని రహదారుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి కాంట్రాక్టర్లు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం కూడా ఇందులో భాగమే. గడచిన రెండున్నరేళ్లలో ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలో అర్ధం కాని పరిస్ధితిలో అధికార పార్టీ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి జరిగిందని చెప్పి మీడియాలో రాయించుకోవటం కాదు క్షేత్రస్ధాయిలో వాస్తవాలను మాట్లాడుకునే ప్రజలు నమ్మాలి కదా?