ఇపుడే రాజకీయ వేడి ఇలావుంటే ఏడాది చివరకు వచ్చేసరికి ఇంకెలా వుంటుందో ఏమో.

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళుంది. అయినా సరే గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలైపోయింది. మామూలుగా అయితే, చివరి ఏడాదిలో వేడి మొదలవుతుంది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలం నుండే వేడి రాజుకుంది. గతానికి భిన్నంగా ఎందుకలా జరిగింది? అందుకు కారకులు మాత్రం నిస్పందేహంగా చంద్రబాబునాయుడనే చెప్పాలి.

ఎన్నికలపుడు మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడుతానని ఒకపుడు చెప్పుకునే వారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి రాజకీయాలు మొదలుపెట్టారు. వైసీపీ ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటం ద్వారా కొలిమి రాజేసారు. ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే వైసీపీ ఎంపి ఎస్పివై రెడ్డి చంద్రబాబు ఇంట్లో కనిపించారు. తరువాత కొత్తపల్లి గీత. ఇక ఆ తరువాత వరుసగా ఎంఎల్ఏలు. ఇలా ఫిరాయింపు ప్రోత్సహించటం ద్వారా నిత్యం రాజకీయ వాతావరణం వేడిగా వుండేట్లు చంద్రబాబు ఆజ్యం పోస్తూనే ఉన్నారు.

ఇక, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అద్యక్షుడు జగన్మహన్ రెడ్డి నిత్యమూ ఓదార్పు యాత్రలని, మరోటని ప్రజల్లోనే ఉంటున్నారు. దానికి తోడు ఫిరాయింపులపై ధ్వజమెత్తుతూ, చంద్రబాబు వైఖరిని నిలదీస్తూ ప్రజల్లోనే తిరుగుతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ చేయాల్సిందే చేస్తున్నారు. దానికితోడు ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కటం కూడా ప్రతిపక్షానికి కలిసి వచ్చింది. దాంతో అధికార పార్టీపై నిరసనలు, ఆందోళనలతో నిత్యమూ జగన్ కు పోరాటమే.

ఇక, మధ్యలో తానూ ఉన్నానంటూ పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలను వేడెక్కించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన దాదాపు రెండేళ్లు కామ్ గా ఉన్న పవన్ లేటుగా అయినా ప్రత్యేకహోదా కోసం గళం విప్పారు. ఇప్పటి వరకూ మూడు బహిరంగ సభలు నిర్వహించారు. ఆమధ్య ఉధ్థానం కిడ్నీ బాధితుల పరామర్శని, తాజాగా చేనేత కార్మికులకు మద్దతుగా బహిరంగసభ నిర్వహించారు. జగన్, పవన్ తో పాటు నారా లోకేష్ కూడా యువత లక్ష్యంగా కళాశాలల్లో సమావేశాలు పెట్టటం కూడా రాజకీయాలు వేడెక్కటానికి దోహదపడ్డాయి. అన్నింటికన్నా ప్రధానం సోషల్ మీడియా. మూడు పార్టీల మధ్య సోషల్ మీడియాలో మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్ధిపార్టీలపై విరుచుకుపడుతుంటం రాజకీయాల వేడిని చల్లారనీయకుండా చూస్తున్నాయి. ఇపుడే రాజకీయ వేడి ఇలావుంటే ఏడాది చివరకు వచ్చేసరికి ఇంకెలా వుంటుందో ఏమో.