చంద్రబాబు లేఖ : స్పందించిన ఈసీ, ఆ అధికారులపై యాక్షన్.. వైవీ సుబ్బారెడ్డిపైనా చర్యలకు టీడీపీ చీఫ్ డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పోలింగ్ కేంద్రాల్లో పర్యటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై ఎన్నికల సంఘం స్పందించింది. ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల రాసిన లేఖపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటించారని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఏపీ సీఈవో .. సుబ్బారెడ్డి పర్యటనకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు లేఖకు రిప్లయ్ ఇచ్చారు సీఈవో. అయితే అధికారులపై చర్యలతో సరిపోదని, సుబ్బారెడ్డిపైనా యాక్షన్ తీసుకోవాలని టీడీపీ అధినేత కోరారు.
ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పార్టీల నాయకులు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ కౌంటింగ్ కేంద్రాల వద్ద హీట్ ను పెంచారు. అయితే.. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటీ పడ్డాయి. తాజా ఫలితాల్లో తూర్పు రాయలసీమ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Also Read: ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురురెబ్బ.. ఎమ్మెల్సీగా టీడీపీ వేపాడ చిరంజీవి రావు ఘన విజయం...
టీడీపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయంతో కనిగిరి ఆ పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు సంబరాలు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత రాత్రి స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ నాయకులు బాణసంచా కాల్చి, డాన్సులు చేస్తూ విజయ సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జై కొడుతూ.. టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనూ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ విజయం సాధించారు. విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతాన్ని టిడిపి అభ్యర్థి చిరంజీవి రావు తొలి ప్రాధాన్యంలోనే సాధించారు. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించాలంటే 94,509 కోట ఓట్లు అవసరం. కాగా, చిరంజీవిరావుకు 82, 958 ఓట్లు మొదటి ప్రాధాన్యంలో వచ్చాయి.
ఇక్కడ మొత్తం 2,01,335 ఓట్లు పోలయ్యాయి. వీటిని ఎనిమిది రౌండ్లలో లెక్కించారు. టిడిపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లలో 41.20%, వైసీపీ అభ్యర్థికి 27.25% ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య 13.95% వ్యత్యాసం ఉంది. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మాధవ్ తో పాటు, మరో 34 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.