అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఈ ఏడాది ఆగష్టు  24వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.ఈ ఏడాది జూన్ 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 

దీంతో ఏపీ శాసనమండలి సభ్యత్వాలకు ఈ నెల 1వ తేదీన వీరిద్దరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను మండలి ఛైర్మెన్ షరీఫ్ ఆమోదించారు.
ఇదిలా ఉంటే మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి  ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

ఆగష్టు 6వ తేదీన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 13వ తేదీన నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగష్టు 24వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్లను లెక్కించనున్నారు.ఇప్పటికే గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలను  రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదించారు. ఈ పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు.