అనంతపురం: తన తమ్ముడిని ఓ వ్యక్తి తన కుమారులతో కలిసి హత్య చేశాడు. పాతకక్షలు, వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణాలని తెలుస్తోంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం బొంతపల్లిలో ఈ నెల 17వ తేదీన జరిగింది.

పట్టపగలు అందరూ చూస్తుండగా వారు హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన చంద్రశేఖర్‌, శివన్న, ముత్తరాయుడు, మంజునాథ్‌, సత్యనారాయణ, శ్రీనివాసులును  గంగసానివారిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసారు.

సంఘటన వివరాలను కదిరి రూరల్‌ సీఐ మన్సూరుద్దీన్‌, ఎస్‌ఐ నాగేంద్ర మీడియాకు  వెల్లడించారు. రవీంద్రకు అన్నతో పాతకక్షలుండేవి. అల్లనేరుడు కాయల్లో విషం కలిపి తన అన్నను, అతడి కుమారులను హత మార్చడానికి రవీంద్ర ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

విషయం బయటపడటంతో గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అందులో భాగంగా నల్లచెరువు మండలంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని వెళ్లారు. అయితే అక్కడ కుటుంబంలోని మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. దీంతో ప్రమాణం చేయకుండా వెనుదిరిగి వచ్చేశారు. 

దాంతో గత శనివారమే రవీంద్రను హత్య చేయాలని పథకం రచించారు. శనివారం అతడు బయటకు రాలేదు. ఈనెల 17న ఉదయం తన వదిన ఇంటికి వెళ్తుండగా మాటువేసిన ప్రత్యర్థులు కొడవళ్లతో దాడి చేశారు. ప్రాణ భయంతో పరుగులు తీస్తుండగా పట్టుకుని నరికేశారు. 

నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి వేట కొడవళ్లు, రెండు ద్విచక్రవాహనాలు, సె ల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.