Asianet News TeluguAsianet News Telugu

AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ..!

AP SSC Exams:  క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో పదో తరగతి పరీక్షలు మార్చిలో తప్పనిసరిగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది తమ లక్ష్యమన్నారు. 
 

Education Minister Adimulapu Suresh Clarifies 10th Class Exams Will Be On March 2022
Author
Hyderabad, First Published Jan 8, 2022, 12:58 AM IST

AP SSC Exams:  దేశంలో మ‌రోసారి క‌రోనా త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది. అదే స‌మ‌యంలో క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి వేగ‌వంతంగా అవుతోంది. ఈ వేరియంట్ ప్ర‌భావం కూడా అధికంగానే ఉంది. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. వ్యాక్సినేష‌న్ పై దృష్టి సారించింది. మన దేశంలో కూడా 15 నుంచి 18 సంవత్సరాలలోపు వాళ్లందరికీ  వ్యాక్సినేషన్‌‌కు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ త‌రుణంలో పదో తరగతి పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 
గుంటూరు జిల్లా వినుకొండ కేజీబీవీ, గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆది మూల‌పు సురేష్  మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలను కేవ‌లం 7 ప‌రీక్ష‌ల‌తో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 
సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రతి స్కూల్‌లో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.

సాధ్య‌మంత త్వ‌రగా.. సీబీఎస్‌ఈ సిలబస్ ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాల‌నేది జ‌గ‌న్ స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని  మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే  అమ్మఒడి మూడో విడత ఇస్తామని తెలిపారు. ఏ విద్యార్థి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని.. అమ్మ ఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫాం, బుక్స్‌తో పాటు మధ్యాహ్న పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ, 375 కాలేజీలు మూతపడ్డాయని మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వానికి  అభివృద్ధి, సంక్షేమం  అనేవి రెండు కళ్లన్నారు. 

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు  వినుకొండ‌లో పర్యటించారు. తొలుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ త‌రువాత‌.. బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కస్తూర్భా గురుకుల పాఠశాలను సందర్శించి.. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి మంత్రి సురేశ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భోజనం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios