తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ హస్తానికి హ్యాండిచ్చి జనసేనకు జై కొట్టారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. 

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ హస్తానికి హ్యాండిచ్చి జనసేనకు జై కొట్టారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పంతం నానాజీ పలు పదవులు చేపట్టారు. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. ఏపీలోకాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీలోనే ఉంటూ సేవలందించారు. పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు నానాజీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగితే తనను నమ్ముకున్న వారికి న్యాయం చెయ్యలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.

 కాంగ్రెస్‌తో తనకెటువంటి విబేధాలు లేవని ఒక్క కార్యకర్తను కూడా తన వెంట తీసుకెళ్లడం లేదన్నారు. జనసేన పార్టీలో టికెట్‌ ఆశించడం లేదని... కేవలం పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చినందువల్లే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పవన్‌ పర్యటన సమయంలో చేరతానని స్పష్టం చేశారు. 

ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ జనసేనలోకి రావడం కాంగ్రెస్ నుంచి పంతం నానాజీ ఇలా క్యూ కట్టడం చూస్తుంటే రాబోయే పవన్ పర్యటనలో జిల్లాలో భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది.