గాలి ఇంట జరుగుతున్న ’నల్ల’ వివాహానికి హాజర్యే బిజెపి నేతలను బిజెపి బహిష్కరించగలదా- ఇఎఎస్ శర్మ సవాల్

దాదాపు రు 500 కోట్ల ఖర్చుతో విలాస వికారానికి పరాకాష్టగా సాగుతున్న నల్లమహారాజు గాలిజనార్దన్ రెడ్డి కూతరు పెళ్లికి హాజరయ్యే బిజెపి నాయకులను పార్టీ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం మాజీ ఇంధన కార్యదర్శి, ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ ఇఎ ఎస్ శర్మ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

’మీ చర్యల వల్ల అసేతు హిమాచలం సామాన్య మానవులంతా డబ్బుల్లేక అల్లాడుతున్న సమయంలో కోట్లకు కోట్లు ఖర్చు చేసి జరుపుతున్న బెంగుళూరు వివాహానికి హజరయ్యే వారిని పార్టీని తొలగించినపుడే మీరు నిజాయితీగ నల్ల ధనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు లెక్క’ అని ఆయన ఈ లేఖ లో పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ ఇలాంటి చర్య తీసుకోగలదా అని ఆయన ప్రశ్నించారు.

 నల్లధనం విషయంలో ద్వంద్వ వైఖరి పనికిరాదని చెబుతూ ముందు మీచట్టూర ఉన్న ’నల్ల’ దొరలను ఏరిపారేయడం అవసరమన్న విషయం విస్మరించరాదని ఆయన ప్రధాని మోదీకి సూచించారు.

’మోదీ అంటే చెప్పింది చెసే నిఖార్సయిన మనిష’ ని ఈ దేశం విశ్వసించాలంటే, ఒక్క నల్లధనవంతుడినయినా పట్టి ప్రజల ముందుకీడ్చి, వారి బినామీ అస్తులను రోడ్డు మీద పడేసినపుడే మీరు నలుగురి ఆదర్శవంతులవుతారు’ అని సూచన చేస్తూ నే ఛాలెంజ్ విసిరారు.

ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టానికి తీసుకువచ్చిన పనికిమాలిన సవరణను ఉపసంహరించుకుని ముఖ్యమంత్రుల, మంత్రులు, ఇతర పెద్దమనుషుల విదేశీ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు బయట పడేసే చర్య లు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారని డాక్టర్ శర్మ చెప్పారు.

నోట్ల రద్దుతో సతమతమవుతూ సామాన్యులు వివాహాలను వాయిదా వేసుకుంటున్నపుడు రంగరంగ వైభోగంగా జరుగనున్న గాలిజనార్దన్ రెడ్డి కూతురి వివాహం జరుగుతు ఉందని ఆయన గుర్తు చేశారు.

ఈ వివాహాన్ని దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని బిబిసి వంటి అంతర్జాతీయ వార్త సంస్థలు , కథనాలు వెలువరించాయని చెబుతూ అనేక మంది బిజెపి నేతలు ఆయన దగ్గరి నుంచి విరాళాలు పొందిన విషయాన్ని కూడా డాక్టర్ శర్మ ప్రధాని దృష్టికి తెచ్చారు.

ఈ పెళ్లి సందర్భంగా అనేక మంది బిజెపి ప్రముఖులు జనార్దన్ రెడ్డితో మళ్లీ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న విషయాన్ని కూడా ఆయన లేఖ లోపేర్కొన్నారు.

’సిబిఐ ఎంత లోతుగా దర్యాప్తు చేసినా, నల్లధనం మీద మీరెంత గట్టిగా సర్జికల్ స్ట్రయిక్ జరిపినా జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి ప్రభావం చూపినట్లు లేవు. ఈ పెళ్లిలో తన సంపదన చాలా వికారంగా ప్రదర్శిస్తున్న తీరును బట్టి ఆయన దగ్గిర గుట్టలు గుట్టలుగా ధనం మూలుగుతూనే ఉందని అర్థమవుతుంది,’ ఆయన అన్నారు.

అనుమానాస్పద మయిన ధనంతో జరుగుతున్న ఈ వివాహానికి హాజరయిన వారిని ఉపేక్షిస్తే ప్రధాని నల్లధనం పై సర్జికల్ స్ట్రయిక్ ధ్యేయం మీద అనుమానాలువస్తాయని శర్మ హెచ్చరిక చేశారు.