అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ పరీక్షలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి.

 ఎంసెట్ పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనునన్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 14  సెషన్లలో ఏడు రోజుల పాటు సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 

ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు రెండో సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నెల 17, 18, 21, 22,23 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.  ఈ నెల 23,24, 25 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. 

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ విభాగాల్లో  2,72,900 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 47 పట్టణాల్లో 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతి ఇవ్వరు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే కోవిడ్ మార్గదర్శకాలతో పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ప్రతి విద్యార్ధికి హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.