హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన మంత్రివర్గ సమావేశం జరుగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సెలవుపై వెళ్లడంతో ఆ సమావేశంపై నీలినీడలు అలుముకున్నాయి. 

మంత్రివర్గ సమావేశం పెట్టడాన్ని చంద్రబాబు సవాల్ గా తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై, ఎన్నికల కమిషన్ పై ఆగ్రహంతో ఆయన ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు  ఈ నెల 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి సబందించిన ఎజెండాను ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసింది. ఆ ఎజెండాను ఈసి అనుమతి కోసం ఎల్వీ సుబ్రహ్మణ్యం పంపించారు. ఈసీ అనుమతిస్తే తప్ప చంద్రబాబు తలపెట్టిన మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేదు. 

కరువు, తాగునీటి సమస్యలపై, తుఫాన్ నష్టంపై చర్చించడానికి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నోట్ పెట్టారు. దాన్నే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసింది.  మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ద్వివేది ఎన్నికల కమిషన్ కు పంపించారు. 

అయితే, ఈలోగా ద్వివేదీ సెలవుపై వెళ్లారు. ఆయన 15వ తేదీ వరకు సెలవుపై ఉంటారు. ఈ నెల 16వ తేదీన తిరిగి విధుల్లో చేరుతారు. అయితే, ఈసీ అనుమతి ఇస్తుందా, లేదా అనేది ఓ ప్రశ్న అయితే, ఒక వేళ ద్వివేదీ లేకున్నా ఈసీ అనుమతి ఇచ్చిన విషయం ప్రభుత్వానికి చేరుతుందా లేదా అనేది మరో ప్రశ్న. మంత్రి వర్గ సమావేశానికి ద్వివేది సెలవు ఆటంకం కలిగించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.