లోకేష్ కోసమే తాంత్రిక పూజలు

First Published 2, Jan 2018, 3:41 PM IST
Durga temple tantric pujas performed to make Lokesh next CM says YCP
Highlights
  • నారా లోకేష్ కోసమే విజయవాడలోని దుర్గ గుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని వైసిపి తీవ్రంగా ఆరోపించింది.

నారా లోకేష్ కోసమే విజయవాడలోని దుర్గ గుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని వైసిపి తీవ్రంగా ఆరోపించింది. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశ్యంతోనే గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని చెప్పింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జనవరి 1వ తేదీ రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేయకూడదని ఆదేశించిన చంద్రబాబు దుర్గగుడిలో జరిగిన ప్రత్యేక పూజలకు బాధ్యత వహించాలని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తమకే ఓట్లు వేయాలని చంద్రబాబు బెదిరింపులపై మండిపడ్డారు. జనాలు టిడిపికి ఎందుకు ఓట్లు వేయాలంటూ నిలదీసారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను పడిన కష్టానికి ప్రజలు తనకు ఓట్లు వేయాలని చెప్పటంలో అర్ధం లేదన్నారు. చంద్రబాబు కష్టపడుతున్నది రాష్ట్రం కోసం కాదని, కేవలం లోకేష్ కోసమే అంటూ ఎద్దేవా చేసారు. కొడుకును మంత్రిని చేయటానికి మాత్రం చంద్రబాబు చాలా కష్టపడినట్లు ఎద్దేవా చేశారు.

పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా సంపూర్ణంగా అమలు చేసారా అంటూ ప్రశ్నించారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం...ఇలా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయినట్లు విమర్శించారు. పోలవరానికి సమాధి కట్టినందుకా? ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నందుకా? లేక కోట్ల రూపాయలతో వైసిపి ఎంఎల్ఏలను కొన్నందుకా? 600 హామీలిచ్చి పట్టుమని 10 హామీలు కూడా అమలు చేయనందుకు ఓట్లేయాలా అంటూ నిలదీసారు.

 

 

loader