టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కు కోర్టు పెద్ద షాకే ఇచ్చింది.  భీమడోలు కోర్టు తనకు విధించిన శిక్షపై స్టే తెచ్చుకోవాలని అనుకున్న చింతమనేనికి ఏలూరు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ హయాంలో అప్పట్లో మంత్రిగా చేసిన వట్టివసంత కుమార్ పై బహిరంగ వేదికపై చింతమనేని ధౌర్జన్యం చేశారు. దాంతో చింతమనేనిపై మంత్రి భద్రతా సిబ్బంది పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఫిర్యాదు తర్వాత కోర్టుకెళ్ళింది. కోర్టులో చింతమనేని ధౌర్జన్యం రుజువైంది.

అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం భీమడోలు కోర్టు చింతమనేనికి ఈ మధ్యనే 2 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. దాంతో చింతమనేని వ్యవహారం చంద్రబాబునాయుడుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. నిబంధనల ప్రకారమైతే ఈపాటికే చింతమనేనిపై అనర్హత వేటు పడుండాల్సింది. ఇప్పుడు గనుక చింతమనేనిపై అనర్హత వేటు పడితే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయటానికి ఎంఎల్ఏల అవకాశం ఉండదు.

అందుకనే ఎంఎల్ఏపై చర్యలు తీసుకోవటంలో కాలయాపన జరుగుతోందని వైసిపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. వెంటనే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసిపి పట్టుబడుతోంది. ఈ నేపధ్యంలోనే భీమడోలు కోర్టు తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ చింతమనేని ఏలూరులోని జిల్లా కోర్టలో అప్పీలు చేసుకున్నారు. కేసు పూర్వపరాలను విచారించిన కోర్టు ఎంఎల్ఏ అప్పీలును కొట్టేసింది. భీమడోలు కోర్టు తీర్పునే సమర్ధించింది. దాంతో చివరకు హైకోర్టుకు వెళ్ళటానికి చింతమనేని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం.