కృష్ణా జిల్లాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిపైనే కత్తితో దాడిచేసి హతమార్చడానికి ప్రయత్నించాడు.
మైలవరం: చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడిన కన్న తండ్రినే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడో కసాయి కొడుకు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తండ్రిని అతి కిరాతకంగా కత్తితో నరికాడు. ఈ దారుణం కృష్ణా జిల్లా (krishna district) లో చోటుచేసుకుంది.
మైలవరం (mailavaram) నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం (reddigudem) నివాసి చాట్ల సురేష్(30) మద్యానికి బానిసయ్యాడు. ఫుల్లుగా మద్యం సేవించి అదే మత్తులో ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. ఇలా ప్రతిరోజూ రెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో హంగామా సృష్టించేవాడు.
Video
ఇలా నిన్న(మంగళవారం) కూడా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్న సురేష్ తండ్రి ఏసు(55)తో గొడవకు దిగాడు. ఇంకా తాగడానికి తనకు డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. అయితే తనవద్ద డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో కోపోద్రిక్తుడైన సురేష్ సైకోలా మారిపోయాడు.
డబ్బులు అడిగితే ఇవ్వనంటావా అంటూ కన్నతండ్రిపై దాడికి దిగాడు. ఇంట్లోని కత్తిని తీసుకుని తండ్రిపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు. ఒంటిపై ఎక్కడపడితే అక్కడ కత్తి గాట్లు పడటంతో ఏసు రక్తపుమడుగులో పడిపోయాడు. తండ్రిపై దాడి అనంతరం సురేష్ పరారయ్యాడు.
వెంటనే స్పందించన స్థానికులు 108కు సమాచారమివ్వగా రక్తపుమడుగులో పడివున్న ఏసును హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏసు పరిస్థితి నిలకడగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిపై తాగినమత్తులో హత్యా యత్నానికి పాల్పడిన తాగుబోతు సురేష్ పరారీలో వున్నాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలివుంటే తమకు ఇష్టం లేకున్నా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న చెల్లిపై పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తితో నరికి చంపడానికి ప్రయత్నించాడో సోదరుడు. ఈ దుర్ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలెంకు చెందిన అశోక్ లు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమ విషయం తెలిసి అభ్యంతరం చెప్పారు. దీంతో వాళ్లు తమ పెళ్లికి ఎలాగూ అంగీకరించరనుకున్నారేమో.. ఇద్దరు మేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.
దీంతో ఈ విషయం కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రాత్రి కావడంతో అప్పటికి వారిని వెళ్ళిపోయి.. మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. రాత్రికి శిరీషను తమ ఇంటికి తీసుకువెళ్లాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్నారు.
అయితే, శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారి చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అనుకోని ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీస్ స్టేషన్ ఎదుటే కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. హరీష్ నుంచి ఆమెను రక్షించి.. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
