అనుమానం పెనుభూతమై విచక్షణను కోల్పోయిన ఓ తాగుబోతు కట్టుకున్న భార్యపై రోకలిబండతో అతికిరాతకంగా దాడిచేసాడు. దీంతో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది.
అనంతపురం: భార్యపై అనుమానం పెనుభూతమై చివరకు ఓ తాగుబోతు భర్త దారుణానికి తెగబడ్డాడు. మద్యంమత్తులో కట్టుకున్న భార్యపై రోకలిబండతో దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేసాడు. ఈ అమానుషం అనంతపురం జిల్లా (anantapur district)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కర్ణాటక నాగలాపురానికి చెందిన బోయ వెంకటలక్ష్మమ్మ(40)- వెంకటేశ్ (45) భార్యాభర్తలు. వీరికి సౌమ్య, మంజునాథ్ సంతానం. స్థానికంగా సరయిన ఉపాధి లేక వెంకటేశ్ భార్యాపిల్లలతో కలిసి పక్కనే వుండే ఆంధ్ర ప్రదేశ్ కు వలసవచ్చాడు. పదేళ్లుగా ఈ కుటుంబం అనంతపురం జిల్లా కంబదూరులో నివాసముంటున్నారు. ఓ ఇంట్లో అద్దెకుంటూ భార్యాభర్తలిద్దరూ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకునేవారు.
అయితే కూలీపనులకు వెళ్ళివచ్చాక అలసటను మరిచిపోయేందుకు వెంకటేశ్ మద్యం తాగేవాడు. అయితే ఇలా రోజూ తాగడంతో అదికాస్తా అలవాటుగా మారింది. ఇలా మద్యానికి బానిసైన అతడు కూలీ పనులకు వెళ్లకుండా కుటుంబపోషణను భార్యపైనే మోపాడు. అంతేకాదు మద్యంమంత్తులో భార్యను అనుమానిస్తూ వేధింపులకు దిగేవాడు. ఇలా ప్రతిరోజూ భార్యాభర్తల మద్య గొడవ జరిగేది.
ఇలా నిన్న(శనివారం) కూడా ఉదయమే వెంకటేశ్ మద్యం సేవించి ఇంటికివచ్చి భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్యపై కోపంతో రగిలిపోయిన అతడు బయటకు వెళ్లి మరింతగా మద్యం సేవించాడు. మధ్యాహ్నం మత్తులో ఇంటికి చేరుకున్న అతడికి భార్య వెంకటలక్ష్మమ్మ నిద్రిస్తూ కనిపించింది. ఇదే అదునుగా భావించిన అతడు నిద్రలో వున్న భార్యపై రోకలిబండతో దాడిచేసాడు.
ఈ దాడిలో తలపగిలి తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంకటలక్ష్మమ్మ అక్కడికక్కడే చనిపోయింది. భార్య చనిపోయినట్లు నిర్దారించుకున్నాక వెంకటేశ్ అక్కడినుండి పరారయ్యాడు. తల్లి రక్తపుమడుగులో పడివుండటాన్ని గమనించిన పిల్లలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న మృతురాలి భర్త కోసం గాలింపు చేపట్టారు. అయితే తండ్రి చేతిలోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు బిడ్డలు దిక్కులేనివారిగా మారారు. తల్లి మృతదేహం వద్ద వీరి కన్నీరు పెట్టుకుంటుంటే ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఇలా మద్యం మహమ్మారి ఓ ప్రాణాన్ని బలితీసుకోవడమే కాదు కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది.
