ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి గురువారానికి తీవ్ర వాయుగుండంగా మారింది.

ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ నెల 15 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపుగా రానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గాలులు పెరిగే అవకాశం ఉంది. 15, 16న దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది తుఫానుగా మారితే దక్షిణ కోస్తాతో పాటు మధ్య కోస్తా వరకు తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.