ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించే అంబులెన్స్ లో అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలను తరలిస్తున్న ఓ వ్యక్తి విశాఖ పట్నంలో పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అంబులెన్స్ లో తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు. 

ఈ హైటెక్ స్మగ్లింగ్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నం సమీపంలో చెన్నై-కలకత్తా హైవేపై ఓ అంబులెన్స్ భారీఎత్తున గంజాయి తరలిస్తున్న డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దీంతో అంబులెన్స్ ను వెంబడించి సబ్బవరం వద్ద ఆపారు. అందులో తనిఖీ చేపట్టిన అధికారులు 1813 కేజీల గంజాయిని గుర్తించారు. దీన్ని స్వాధీనం చేసుకుని అధికారులు నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో రూ.2,71,95,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

విశాఖ సమీపంలోని ఏజన్సీ ప్రాంతాల  నుండి సేకరించిన ఈ గంజాయిని చత్తీస్ ఘడ్ లోని  రాయ్ పూర్ కు తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. పట్టుబడిన గంజాయితో పాటు  అంబులెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. ఎన్డీఫీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.