ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ ఎన్440కే వేరియెంట్ ఉద్ధృతంగా వున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మహమ్మారి వల్ల కేసులు పెరగడంతో పాటు ప్రజలు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాకెట్ వేగంతో విస్తరిస్తోంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో గురువారం దీనిపై వివరణ ఇచ్చారు.

గత ఏడాది జూన్, జులై‌లో ఈ స్ట్రెయిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్440కే వేరియెంట్ ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఈ రకం వైరస్‌ను చాలా తక్కువ‌గా గుర్తిస్తున్నామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read:కరోనా కట్టడి : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.

ప్రస్తుతం దక్షిణ భారతదేశ నమూనాల నుంచి బి.1.617, బి1 రకాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీనిని గుర్తించామని ఆయన చెప్పారు. అయితే మిగిలిన వెరియేంట్‌లతో పోలీస్తే ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని జవహర్ రెడ్డి హెచ్చరించారు.

ముఖ్యంగా యువతలో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.