లోకేష్ వ్యాఖ్యల ఎఫెక్ట్: కర్నూల్ టీడీపీలో టిక్కెట్టు చిచ్చు, టీజీ భరత్ సంచలనం

First Published 5, Aug 2018, 11:02 AM IST
DP leader TG Bharat sensational comments on Kurnool ticket for 2019 elections
Highlights

కర్నూల్  అసెంబ్లీ స్థానంలో సర్వే  ఆధారంగా టిక్కెట్టు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు  టీజీ భరత్  టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 

కర్నూల్:కర్నూల్  అసెంబ్లీ స్థానంలో సర్వే  ఆధారంగా టిక్కెట్టు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు  టీజీ భరత్  టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 

కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  ఎస్వీ మోహన్ రెడ్డి బరిలోకి దిగుతారని  ఏపీ మంత్రి  నారాలోకేష్  ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భరత్  ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవలనే  కర్నూల్ పర్యటన సందర్భంగా లోకేష్ చేసిన ప్రకటన టీజీ భరత్‌కు నిరాశను మిగిల్చింది. ఈ తరుణంలో ఆదివారం నాడు భరత్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్నూల్ అభివృద్ధి చెందాలంటే కర్నూల్ నుండి చంద్రబాబునాయుడు పోటీ చేయాలని కోరారు. ఒకవేళ చంద్రబాబునాయుడు పోటీ చేయలేని పరిస్థితులు  నెలకొంటే కర్నూల్ అసెంబ్లీ స్థానంలో సర్వే ఆధారంగా టిక్కెట్టును కేటాయించాలని డిమాండ్ చేశారు.

కర్నూల్ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్‌లు రంగం సిద్దం చేసుకొంటున్నారు. గత ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్ పోటీ చేశారు.  అయితే ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత టీజీ వెంకటేష్ కు చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో  టీజీ భరత్‌ను కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి వెంకటేష్ బరిలోకి దింపాలని భావించారు.

అయితే కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామల నేపథ్యంలో  వైసీపీ నుండి ఎస్వీ మోహన్ రె్డ్డి టీడీపీలో చేరారు.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో  టిక్కెట్టు ఇవ్వనున్నట్టు  లోకేష్  ప్రకటించడంతో  తాజాగా  టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

loader