తల్లిదండ్రులు లేని ఓ యువతిని పెళ్లి చేసుకుని, వరకట్న వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాలలో కలకలం రేపింది. అల్లారు ముద్దుగా పెంచిన మేనమామ 15 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ భర్త మరింత కట్నం కావాలని వేధించడంతో ఆ యువతి మేనమామకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. కర్నూలు జిల్లా నంద్యాలలోని మాల్దార్ పేటకు చెందిన మనీషా(20)కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఆమె బాగోగులను ఆమె మేనమాననే చూసుకున్నాడు. ఇంటర్ వరకు చదివించాడు. 20యేళ్లు వచ్చాక ఆమెకు పెల్లి చేశాడు. 

నంద్యాల పట్టణంలోనే చింతరుగు వీధికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో జనవరిలో మనీషా పెళ్లి జరిగింది. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటాడు. పెళ్లి సమయంలో అబ్బాయి తరఫు వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చారు. 

దాదాపు 15 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని పెట్టాడు. ఘనంగా పెళ్లి చేశాడు. తల్లీదండ్రులు లేని పిల్లను బాగా చూసుకోవాల్సిన భర్త, పెళ్లైన కొంత కాలానికే వేధింపులు మొదలుపెట్టాడు. 

వ్యాపారం కోసం అదనపు కట్నం కావాలని, అది తీసుకురావాలని వేధించేవాడు. వెళ్లట్లేదని హింసించడం మొదలు పెట్టాడు. తన కోసం ఇప్పటికే మామయ్య ఎంతో కష్టపడ్డాడని, చదివించి, ఘనంగా పెళ్లి కూడా చేశాడనీ, ఇప్పుడు అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నారని మేనమామతో చెప్పుకోలేక మనీషా ఆవేదనకు గురై, ఆత్మహత్య చేసుకుంది. 

విషయం తెలిసిన మేనమామ మహేష్ కోడలి భర్త రాజేష్, అతడి కుటుంబ సభ్యలపై కేసు పెట్టాడు. అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు, కోడలి భవిష్యత్తు బాగుంటుందనుకున్నానని, ఇలా చిత్రహింసలకు గురిచేస్తాడని తాను ఊహించలేకపోయానని వాపోయాడు. విషయం నాకు చెబితే ఏదో ఒకటి చేసేవాడికి కదమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు.