చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. సుష్మిత అనే యువతిని చిన్నప్ప అలియాస్ వరదయ్య అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన సుస్మిత బంధువులు వరదయ్య పై రాళ్లతో దాడి చేసి హతమార్చారు. 

మృతురాలు సుస్మిత చాలాపల్ల సీఎంసీ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన చిన్నప్ప గత కొద్ది రోజులకుగా ప్రేమ పేరుతో ఆమె మీద వేదింపులకు పాల్పడుతున్నాడు. 

ఈ వేధింపుల వ్యవహారం మీద కొన్ని రోజుల కిందట గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలో గత రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది సుస్మిత. ఎప్పట్లాగే తన గదిలో నిద్రిస్తోంది. 

శుక్రవారం తెల్లవారుజామున చిన్నప్ప కత్తితో ఆమె గదిలోకి ప్రవేశించి గొంతుకోసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సుస్మిత అన్న, తమ్ముళ్లు చిన్నప్ప మీద రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలు కావడంతో చిన్నప్ప మరణించాడు. 

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.