ఏపిలో ఇంటింటి సర్వే... 604 మంది కరోనా అనుమానితులు
ఆంధ్ర ప్రదేశ్ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు మూడో విడత ఇంటింటి సర్వే కొనసాగుతోంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు ముమ్మరంగా కొనసాగున్నాయి. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించేందుకు మూడో విడత ఇంటింటి సర్వే చురుగ్గా జరుగుతోంది. మరింత పకడ్బందీగా ఈ సర్వేను చేపట్టాలని... రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.
కరోనా లక్షణాలయిన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిపై సర్వే చేపడుతున్న అధికారులు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. 65 ఏళ్ల వయసు దాటిని వారితో పాటు బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రత్యే క దృష్టి పెట్టారు. ఇక ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలనూ సర్వేలో నమోదు చేయనున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ఉన్నతాధికారులకు సమాచారం అందించనున్నారు. వెంటనే వారిని గృహనిర్బంధం,క్వారంటైన్ సిఫారసు చేసేందుకు పరిశీలిస్తున్నారు.
ఇప్పటి వరకూ 3లక్షల 50 వేల కుటుంబాల సర్వే పూర్తవగా 604 మంది కరోనా అనుమానితుల వివరాల నమోదు చేశారు. వారి నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్యాదికారులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.
గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.
జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు ఇవీ...
అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పుగోదావరి 12
గుంటూరు 51
కడప 29
కృష్ణా 35
కర్నూలు 75
నెల్లూరు 48
ప్రకాశం 38
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 22