హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది.  నామినేషన్ల దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేది. నామినేషన్ల స్క్యూట్నీని ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఈ స్థానానికి టీడీపీ  తరపున ఎవరూ కూడ నామినేషన్లు దాఖలు చేయలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. రేపు నామినేషన్ల స్కూట్నీని నిర్వహించనున్నారు. 

మరో అభ్యర్ధి బరిలో నిలిచి ఉంటే ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. ఈ ఏడాది మార్చి 9వ తేదీన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. ఇదే స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. 2023 మార్చి 29వ తేదీ వరకు ఈ ఎమ్మెల్సీ పదవి కాలం ఉంటుంది. 
ఇవాళ ఉదయమే మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.