పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులో చికిత్స చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులో చికిత్స చేశారు. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగానే ఈ పరిస్థితి చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. జీఎల్ పురం మండల పరిధిలోని గోయిపాక గ్రామ సమీపంలో ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదంలో గాయపడిన ఇద్దరు బాధితులను చికిత్స నిమిత్తం కురుపాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొచ్చారు. అయితే అదే సమయంలో ఆస్పత్రిలో కరెంట్ పోయింది. బాధితుల గాయాలపై కుట్లు వేస్తుండగా.. లోడ్ షెడ్డింగ్ కారణంగా కరెంటు పోయింది. ఈ క్రమంలోనే అక్కడి సిబ్బంది మొబైల్ టార్చ్ ఆన్ చేయగా.. ఆ వెలుగులో బాధితులకు చికిత్స అందించారు.
‘‘రెండు నిమిషాలు మాత్రమే విద్యుత్తు నిలిచిపోయింది. ఒక సిబ్బంది జనరేటర్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లగా.. వైద్యుడు మొబైల్ ఫోన్ లైట్ సహాయంతో చికిత్సను కొనసాగించాడు’’ అని పార్వతీపురం హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తెలిపారు.
