ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: డాక్టర్ సుధాకర్ తల్లి ఆరోపణ
తన కొడుకు విషయంలో ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని డాక్టర్ సుధాకర్ తల్లి ఆరోపించారు.
విశాఖపట్టణం: తన కొడుకు విషయంలో ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని డాక్టర్ సుధాకర్ తల్లి ఆరోపించారు.
శుక్రవారం నాడు డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులు విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్న తన కొడుకును మానసిక ఆసుపత్రిలో చేర్చారన్నారు. అంతేకాదు ఆసుపత్రిలో తన కొడుకును ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
తన కొడుకు ఆసుపత్రిలో అందిస్తున్న మందులతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పాడని ఆమె మీడియాకు తెలిపారు.ప్రాణ భయం ఉందని డాక్టర్ సుధాకర్ ఆందోళన చెందుతున్నాడని ఆమె చెప్పారు.
also read:డాక్టర్ సుధాకర్ ఇష్యూ: వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
ఆసుపత్రిలో తనకు అందిస్తున్న మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణం మెంటల్ ఆసుపత్రి సూపరింటెండ్ కు లేఖ రాశారు. మరో వైపు ఈ విషయమై డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు.
also read:సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి: చికిత్సపై డాక్టర్ సుధాకర్ లేఖ కలకలం
డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై విచారణను సీబీఐకి ఇస్తూ హైకోర్టు ఈ నెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విశాఖపట్టణంలోని రోడ్డుపై మద్యం తాగి డాక్టర్ రభస సృష్టించడంతో ఆయనను అరెస్ట్ చేసినట్టుగా విశాఖ పోలీసులు ప్రకటించారు.
అయితే ఈ సమయంలో డాక్టర్ పై దాడికి దిగిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు విశాఖ పట్టణం సీపీ.ఇదిలా ఉంటే డాక్టర్ సుధాకర్ కు జరిపిన ట్రీట్ మెంట్ వివరాలను బయటపెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది.