విశాఖలో తనకు అందిస్తున్న వైద్యంపై హైకోర్టులో డాక్టర్ సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు అందిస్తున్న వైద్యంతో  సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను పిచ్చివాడిగా మార్చేందుకు మందులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. మానసిక ఆసుపత్రి నుంచి తనను మార్చాలని సుధాకర్ కోరారు.

హైకోర్టు పర్యవేక్షణలో తనకు వైద్యం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం, హెల్త్ సెక్రటరీ, డీజీపీ, విశాఖ సీపీ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లను సుధాకర్ ప్రతివాదులగా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. 

Also Read:సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి: చికిత్సపై డాక్టర్ సుధాకర్ లేఖ కలకలం

తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ  చికిత్సతో తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.

డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రి సూపరింటెండ్ కు బుధవారం నాడు లేఖ రాశారు.మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సూపరింటెండ్ ను ఆ లేఖలో కోరారు.ఎలాంటి పరీక్షలు చేయకుండానే తాను మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని సుధాకర్ ఆరోపించారు. 

ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ రోడ్డుపై రభస సృష్టించడంతో అతడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ సమయంలో డాక్టర్  సుధాకర్ పై దాడి చేసిన కానిస్టేబుల్‌ను సీపీ సస్పెండ్ చేశారు.

Also Read:డాక్టర్ సుధాకర్‌కు చేసిన‌ ట్రీట్ మెంట్‌ను బయటపెట్టాలి: వర్ల రామయ్య

డాక్టర్ సుధాకర్ ను ప్రస్తుతం విశాఖపట్టణం మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ కు అందిస్తున్న చికిత్సను బయటపెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇటీవలనే డిమాండ్ చేశారు. 

డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత రాసిన లేఖను పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ పై దాడి ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఈ నెల 22వ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.